నాసాకు లభించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ
సాక్షి, హైదరాబాద్: విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించింది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్ శిథిలాలను నాసా గుర్తించింది. ఇస్రో చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చందమామ దక్షిణ ధ్రువంలో పడిపోయిందన్న విషయం తెలిసిందే. చందమామపై చీకటి వల్ల ఇన్నాళ్లూ ఆ ల్యాండర్ ఎక్కడ కూలిపోయిందో కనిపెట్టలేకపోయాం. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా తాజాగా ఇస్రో విక్రమ్ ల్యాండర్‌ను చందమామపై కనిపెట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2 ద్వారా విక్రమ్ ల్యాండర్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో విక్రమ్ అదుపు తప్పింది. ల్యాండర్ కోసం శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆచూకీ లభించలేదు.