కరోనా సహాయక చర్యల కోసం నందమూరి బాలకృష్ణ తన వంతు బాధ్యతగా రూ.1 కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ.. కొద్ది సేపటి క్రితం మంత్రి కేటీఆర్‌ని కలిసి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయల చెక్ ను అందించారు. ఆ సమయంలో బాలకృష్ణతో పాటు అతని అల్లుడు తదితరులు ఉన్నారు.
ఇక ఈ రోజు ఉదయం లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్ధం 25 లక్షల రూపాయలని కరోనా క్రైసిస్ ఛారిటీ(సిసిసి) ఎగ్జిగ్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్‌కి అందించారు బాలకృష్ణ. కరోనాపై పోరాటానికి తన వంతు బాధ్యతగా ఈ విరాళాన్నిఅందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విపత్తు సమయంలో ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటిస్తూ, కరోనాని అరికట్టడంలో భాగస్వాములు కావాలని పేర్కోన్నారు. సంక్షోభంలో ఉన్న ప్రతి సమయంలో బాలకృష్ణ తన పెద్ద మనసు చాటుకోవడాన్ని చిరు అభినందించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి బాలకృష్ణ రూ.50 లక్షలు ప్రకటించిన విషయం విదితమే